- నిన్నటిదాకా పడవల్లో ప్రయాణం.. ఇప్పుడు కాలినడకనే నది దాటుతున్నరు
మంచిర్యాల, వెలుగు: నిండుగా ప్రవహించాల్సిన నది.. చిన్నపాటి పాయలా మారింది. పడవల్లో దాటాల్సిన చోట.. ఇప్పుడు కాలినడకనే ప్రయాణాలు సాగుతున్నాయి. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వార్ధా నదిలో అక్టోబర్లోనే నీళ్లు తగ్గిపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక నది ఎండిపోతుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందేమోనని భయపడుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్రలను వేరు చేస్తూ ప్రవహించే వార్ధా నది.. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద వైన్గంగతో కలిసి ప్రాణహితగా మారుతుంది.
రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య చుట్టరికాలు, బంధుత్వాలు ఉండటంతో ప్రజలు నిత్యం నది మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఏటా వర్షాకాలం తర్వాత దాదాపు మూడు నెలలపాటు నది నిండుగా ప్రవహించేది. ఆ సమయంలో నాటు పడవల్లో ప్రయాణించేవారు. కానీ ఈసారి అక్టోబర్లోనే ప్రవాహం తగ్గిపోయింది. తాటిపల్లి వద్ద మోకాళ్ల లోతు నీళ్లే ఉండటంతో ప్రజలు కాలినడకన నది దాటుతున్నారు. “ఇంత త్వరగా నీళ్లు తగ్గిపోవడం ఎప్పుడూ చూడలే..” అని స్థానికులు చెప్తున్నారు. గతంలో పడవల్లో దాటిన నదిని ఇప్పుడు నడుచుకుంటూ దాటాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
